పళనికి నా ప్రయాణం: ఆలయ సందర్శన రివ్యూ
నా ఆధ్యాత్మిక ప్రయాణం – పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం (4 దశల్లో)
పళనికి ప్రయాణం

పళని తమిళనాడులోని ధిందిగుల్ జిల్లాలో ఉన్న ఒక పవిత్రమైన మరియు ప్రముఖమైన క్షేత్రం. ఇక్కడ వెలసిన సుబ్రహ్మణ్య స్వామి (మురుగన్ స్వామి)కి అర్పించబడిన ఈ ఆలయం, ఆరు మురుగన్ క్షేత్రాలలో (Arupadai Veedu) మొదటిదిగా పరిగణించబడుతుంది.
ఈ ఆలయం కొండపై ఉంది, దీనిని పళని హిల్స్ (పళని మలై) అని పిలుస్తారు. భక్తులు 693 మెట్లు నడిచి లేదా రోప్ వే, ఎలివేటెడ్ ట్రామ్ ద్వారా స్వామివారిని దర్శించవచ్చు.
ఆలయ విశేషాలు:
స్వామివారి విగ్రహం “నవరత్న” (తొమ్మిది రకాల ఔషధ రత్నాలతో తయారు చేయబడినది), ఇది చాలా ప్రత్యేకమైనది.
ఇక్కడ స్వామిని **”దండాయుధపాణి స్వామి”**గా పూజిస్తారు – ఇక్కడ ఆయన తన తల్లిదండ్రులతో కలహించిన అనంతరం, తన దండాన్ని (బట్ట) మాత్రమే ధరించి వేరు కూర్చున్నట్టుగా భావిస్తారు.
ప్రతి సంవత్సరం థై పూసం, స్కంద షష్టి, పంగుని ఉత్తిరం వంటి పండుగలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు.
మొదటి దశ: పళనికి ప్రయాణం
మేము మా ప్రయాణాన్ని కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ నుంచి ప్రారంభించాం. పళనికి దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఉంది. చాలా వరకు హైవే మార్గం గానే ఉంది, దారిపొడవునా విస్తరించి ఉన్న విండ్ పవర్ జనరేషన్ ఫ్యాన్స్ దర్శనమిచ్చాయి — ప్రకృతి మరియు సాంకేతికత కలయికను ఆస్వాదించాం.
రెండవ దశ: పళనికి చేరుకోవడం
మేము ఉదయం 10 గంటలకు పళనికి చేరుకున్నాం. కొండ తూర్పు వైపు ఉచిత పార్కింగ్ స్థలం ఉన్నా, మేము దక్షిణ దిశ వైపు చేరడంతో, ఆ ఉచిత పార్కింగ్ గురించి తెలియక, అక్కడే వాహనం ఉంచాం. ఆలయం వద్ద గేట్ 1 నుంచి EV వాహనాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి — ఇవి చెక్కిలి మెట్ల స్థలానికి, రోప్ కార్ & రైలు మార్గానికి తీసుకెళ్తాయి.
ఆ రోజు భారీ రద్దీ ఉండటంతో, రోప్ వేకు 4 గంటల వేచి ఉండాల్సి వచ్చింది, రైలు ప్రయాణానికి కూడా 2 గంటల సమయం వేచి చూడాల్సి వచ్చింది.
అందువల్ల, మేము మెట్ల ద్వారా ఆలయానికి చేరాలని నిర్ణయించాం. రెండు మార్గాలు ఉన్నాయి – ఒకటి తక్కువ ఉత్కంఠతో సాఫీగా ఉండే మార్గం, మరొకటి సుమారు 700 మెట్లు ఉండే కొంచెం కష్టం ఉండే మార్గం. మేము రెండవ దారిని ఎంచుకున్నాం.
Rope car

Winch Train


మూడవ దశ: ఆలయం చేరుకోవడం
వేసవి కాలం కావడంతో, మెట్లు ఎక్కుతూ బాగా అలసిపోయాం.
మేము ₹100 దర్శన టికెట్ క్యూలో చేరాం, ఇది ఒక గంటకు పైగా పట్టింది.
అన్ని కష్టాలు మర్చిపోయాను… నేను ప్రధాన గర్భగుడికి చేరినప్పుడు ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. గతంలో నేను వచ్చినప్పుడు దర్శనం దక్కలేదు. కానీ ఈసారి దేవుడి కృపతో నాకు దర్శనం దక్కింది. నా జీవితంలోని అత్యంత ఆనందకరమైన క్షణాల్లో ఇది ఒకటి.
నాలుగవ దశ: ప్రసాదం
దర్శనం అనంతరం మాకు ఉచిత ప్రసాదం లభించింది – అది అద్భుతంగా ఉంది. రుచి చూస్తే, అది శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదంలా అనిపించింది. అలాగే, అక్కడ ₹20, ₹40, ₹60 ధరలతో ప్యాకెట్లలో ప్రసాదం కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.